సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన మొదటి సినిమా 'అతడు'(2005). మహేష్ కెరీర్ లో బెస్ట్ ఫిల్మ్స్ లో ఒకటిగా పేరు తెచ్చుకోవడమే కాకుండా.. బుల్లితెరపై ప్రేక్షకులు అత్యధికంగా వీక్షించిన సినిమాలలో ఒకటిగా నిలిచింది. అయితే ఈ క్లాసిక్ ఫిల్మ్ లో మొదట ఉదయ్ కిరణ్ నటించాల్సి ఉండగా.. ఆయనకు కుదరకపోవడంతో ఈ ప్రాజెక్ట్ మహేష్ దగ్గరకు వెళ్లిందట.
'చిత్రం'(2000) సినిమాతో వెండితెరకు పరిచయమైన ఉదయ్ కిరణ్.. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్నాడు. ఆ తర్వాత 'నువ్వు నేను', 'మనసంతా నువ్వే' సినిమాలతోనూ సూపర్ హిట్స్ అందుకొని హ్యాట్రిక్ హీరోగా మంచి ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. 2000-2005 సమయంలో ఉదయ్ కిరణ్ తో సినిమా చేయడానికి దర్శకనిర్మాతలు క్యూ కట్టారు. ఈ క్రమంలోనే 'అతడు' స్క్రిప్ట్ కూడా మొదట ఉదయ్ దగ్గరికే వెళ్లిందట. ఈ విషయాన్ని అతడు చిత్రాన్ని నిర్మించిన సీనియర్ యాక్టర్ మురళి మోహన్ తాజాగా రివీల్ చేశారు.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న మురళి మోహన్.. 'అతడు' స్క్రిప్ట్ మొదట ఉదయ్ కి వినిపించగా ఆయనకి నచ్చిందని కానీ డేట్స్ అడ్జస్ట్ అవ్వక చేయలేకపోయాడని తెలిపారు. ఆ తర్వాత ఈ స్క్రిప్ట్ మహేష్ దగ్గరకు వెళ్లిందని చెప్పారు.
ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 'అతడు' లాంటి క్లాసిక్ ఫిల్మ్ ని ఉదయ్ అనవసరంగా మిస్ చేసుకున్నాడని, ఆ సినిమా చేసుంటే అతని ఇమేజ్ మరింత పెరిగి బిగ్ స్టార్ గా మారిపోయేవాడని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.